ఆగిన పోలవరం పనులు…..!

కాంట్రాక్టు సంస్థల మధ్య డబ్బు కోసం గొడవ జరుగుతూ ఉండటం, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని సబ్ కాంట్రాక్టర్లు పట్టుబట్టడం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్పష్టం చేస్తూ, ఇప్పటికిప్పుడు డబ్బు చెల్లించలేమని ట్రాన్స్ ట్రాయ్ చేతులెత్తేసిన వేళ, పోలవరం పనులు గత ఐదు రోజులుగా నిలిచిపోయాయి. ముందస్తు చెల్లింపులకు సర్కారుకు విన్నవించిన ట్రాన్స్ ట్రాయ్, నిధులిస్తే, పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెబుతుండగా, పరిస్థితిని ఇంతవరకూ తెచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు పనులకు విడిగా టెండర్లు పిలిచేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. కాగా, పోలవరం కాంట్రాక్టును పొందిన ట్రాన్స్ ట్రాయ్, కాఫర్ డ్యామ్ పనులను ఎల్అండ్ టీ, బావర్ లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులను చిన్న చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్టుకు ఇవ్వగా, కాఫర్ డ్యామ్ పనులు మినహా మిగతా అన్ని పనులూ నిలిచిపోయాయి. జల వనరుల శాఖను ఆశ్రయించి, ముందస్తు చెల్లింపులు చేసి, భవిష్యత్తులో ఇవ్వాల్సిన నిధుల నుంచి రీయింబర్స్ చేసుకోవాలని కోరింది. దీంతో అవాక్కయిన అధికారులు, ఇలా అడగటం గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు, జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి దేవినేని ఉమ, ఇతర అధికారులతో సమీక్షించిన ఆయన, కొన్ని పనులకు ఈ-టెండర్లు జారీ చేయాలని, జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్ర నిర్ణయానుసారం ముందడుగు వేయాల్సి వుంటుందని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*