తుపాకి గొట్టం ద్వారా అధికారమా

power-with-barrel-is-myth

ఎర్రజెండాలన్నీ ఏకం కావాలని, మావోయిస్టులు అడవులు వదిలి ప్రజల్లోకి రావాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని విమర్శిస్తూనే ఆయన ఆ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉదయించడం సహజం. నిజానికి మావోయిస్టులపై లేదా నక్సలైట్లపై ప్రభుత్వ నిర్బంధాలను, ఎన్‌కౌంటర్లను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం ఖండిస్తూనే ఉన్నాయి. కానీ, మావోయిస్టులు లేదా నక్సలైట్ల పంథాను మాత్రం తప్పు పడుతున్నాయి. అదే సమయంలో సిపిఐ, సిపిఎం పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయాయని నక్సలైట్లు విమర్శించడం సర్వసాధారణంగా మారుతాయి. ఈ పరిస్థితులను పరిశీలిస్తే, తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యమనే సూత్రాన్ని భారతదేశంలోని మావోయిస్టులు గుడ్డిగా అనుసరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాతనే కాకుండా అంతకు ముందు జరిగిన పలు ఎన్‌కౌంటర్ల వల్ల కూడా ఈ ప్రశ్న ముందుకు వచ్చే ఉంటుంది. కానీ, వారు తమ పంథాను మార్చుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేరని పలు సందర్బాల్లో రుజువైంది. నక్సలైట్ ఉద్యమంలోని పరిణామాలను పరిశీలిస్తే ఆ ఉద్యమ పయనం ఎటువైపు సాగుతుందనేది అర్థమవుతుంది. నక్సలైట్ల పట్ల సానుభూతి ఉన్న చాలా మంది మేధావులు క్రమక్రమంగా దూరమవుతూ, ఆ సానుభూతిని గుండెల్లో మాత్రమే దాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలంగాణలో ఒకప్పుడు గోదావరి లోయ పోరాటం, జగిత్యాల పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ఉద్యమ ప్రభావం వల్ల ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని అమలు చేయాల్సి వచ్చింది. అది ప్రజా మద్దతు లేకుండా జరిగింది కాదు. ప్రజా మద్దతు కారణంగా ఆ ఉద్యమాలు ఎగిసి పడ్డాయి. కానీ, ఉత్తర తెలంగాణలో ప్రభుత్వాలకు సవాల్‌గా నిలిచిన నక్సలైట్ ఉద్యమాల ప్రభావం ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అతి తక్కువగా కనిపిస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*