రాజీనామా చేయకుంటే ఏమవుతుందో తెలుసా?

ratan-tata-met-cyrus-mistry-before-board-asked-him-quit-tata-lawyer

ప్రస్తుతం మన దేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అనూహ్యంగా తొలగించడం పారిశ్రామిక వర్గాలనే కాకుండా సామాన్యులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, సైరస్ మిస్త్రీని రాజీనామా చేయాలని కోరింది రతన్ టాటానేనట. మిస్త్రీని తొలగించే ముందే… రతన్ టాటా అతడిని స్వయంగా కలిసి ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారట. చేయకపోతే, జరగబోయే పరిణామాలను కూడా స్పష్టం వివరించారట. టాటా సన్నిహితులు వెల్లడించిన దాని ప్రకారం, బ్రిటన్‌లో ఉన్న టాటా స్టీల్ కంపెనీని అమ్మేయాలని మిస్త్రీ నిర్ణయించడం.. రతన్ టాటాను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఓ వైపు యూరప్‌లో వ్యాపారాన్ని విస్తరించాలని టాటా భావిస్తుంటే.. అక్కడున్న ప్రధానమైన సంస్థను మిస్త్రీ అమ్మాలనుకోవడం టాటాను బాధించింది. కాగా, టాటా గ్రూప్‌కు రూ. 3 వేల కోట్ల రుణభారం ఉన్న సంగతి టాటాకు తెలుసని… అయితే, దీనికోసం కంపెనీ రత్నాలను అమ్మేయాలనుకున్న నిర్ణయం టాటాకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రముఖ లాయర్ మోహన్ పరాశరన్ తెలిపారు. మిస్త్రీని మార్చేయాలనే సలహాను రతన్ టాటాకు ఇచ్చిన ముగ్గురిలో పరాశరన్ కూడా ఒకరు కావడం గమనార్హం. మిస్త్రీని తొలగించడానికి నెల రోజుల ముందు అతడిని టాటా కలిసినందున, నెల రోజుల ముందే నోటీసు ఇచ్చినట్టు అవుతుందని పరాశరన్ పేర్కొన్నారు. అంతేగాక, బోర్డులో రతన్ టాటాకు మెజారిటీ ఉన్నందున మిస్త్రీ తొలగింపు చట్టబద్ధం అవుతుందని ఆయన తెలిపారు. మరోవైపు, తనకు చట్టపరంగా ఇవ్వాల్సిన 15 రోజుల నోటీసును ఇవ్వలేదని మిస్త్రీ ఆరోపిస్తుండటం గమనార్హం. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*