కాపీరైట్ వార్ : ఇళ‌య‌రాజా వ‌ర్సెస్ బాలు

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే…ప్రస్తుతం వరల్డ్ టూర్‌లో భాగంగా పలు దేశాల్లో కచేరీలు నిర్వహిస్తున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వీటిలో ఎక్కువగా ఇళయరాజా స్వరపరచిన పాటలు పాడుతున్నారని, ఇంకెప్పుడూ తన పాటలు పాడకూడదని ఇళయరాజా నుంచి బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు అందాయి. ఈ లీగల్ నోటీసుపై బాలసుబ్రహ్మణ్యం ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడకూడదని, అలా చేస్తే కాపీరైట్ నిబంధనలను ఉల్లఘించినట్లు అవుతుందని నోటీసులు అందాయి. అలా చేస్తే పరిహారంగా పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సివస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. తనతో పాటు కుమారుడు చరణ్, గాయని చిత్రకు ఈ నోటీసులు అందాయని బాలు తెలిపారు. ఎస్పీబీ 50 పేరిట ఇండియాతో పాటు రష్యా, శ్రీలంక, మలేషియా, అమెరికాతో పాటు పలు దేశాల్లో కచేరీలో నిర్వహించామని, అమెరికా పర్యటనలో ఉండగా నోటీసులు అందాయని బాలు వెల్లడించారు. చట్టాని తాను గౌరవిస్తానని, తదుపరి కచేరీలను కొనసాగిస్తామని, కానీ వాటిలో ఇళయరాజా పాటలను పాడబోమని, దేవుడి దయవల్ల తాను స్వరపరచిన పాటలు చాలా ఉన్నాయని, వాటినే ఆలపిస్తామని అన్నారు. ఈ విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరుకుంటున్నానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*