వందరెట్ల వేగంతో కొత్త వైఫై

లండన్: హానిలేని పరారుణ (ఇన్‌ఫ్రారెడ్) కిరణాల ఆధారంగా వందరెట్ల వేగంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే కొత్త వైఫై పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మరిన్ని కంప్యూటర్లకు ఈ వైఫైని ఉపయోగించి ఆటంకం లేకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చని వారు తెలిపారు. నెదర్లాండ్స్‌లోని ఈండ్‌హోవెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ వైఫై నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. దీని సామర్థ్యం సెకన్‌కు 40 గిగాబిట్ల కన్నా ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వైఫైతో అనుసంధానించే ప్రతి కంప్యూటర్‌కు ప్రత్యేక కాంతికిరణం అందుతుందని, ఈ సాధనాన్ని ఇతర కంప్యూటర్లకు షేర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఈ వైఫై చాలా చౌక. ఏర్పాటుచేయడం సులభం. వైఫైపై ఉండే సెంట్రల్ లైట్ యాంటెన్నాల నుంచి వైర్‌లెస్ సమాచారం వస్తుంది. కాంతికిరణాలను ఆప్టికల్ ఫైబర్ ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తుంది అని పరిశోధకులు వివరించారు. కాంతి తరంగదూరాన్ని మారిస్తే, కాంతికిరణం దిశ కూడా మారుతుంది. కంటిలోని రెటీనాకు చేరుకోలేని సురక్షిత పరారుణ తరంగదూరాన్ని ఈ వైఫైలో ఉపయోగించడంతో కండ్లకు ఎటువంటి హాని ఉండదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*