అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ కోసం సమాయాత్తమౌతోన్న భారత క్రికెట్ జట్టుకు అనుకోని అవాంతరాలన్నీ వచ్చిపడుతున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఒకరి తరువాత ఒకరు గాయపడటమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న కేప్టెన్ రోహిత్ శర్మ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్‌లో గాయపడ్డాడు. ఒకరోజంతా అతను నొప్పితో ఇబ్బంది పడాల్సొచ్చింది.
కోహ్లీ వంతొచ్చింది..
ఇప్పుడు తాజాగా- విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బంతిని ఆడబోయి గాయపడ్డాడు కోహ్లీ. హర్షల్ లెగ్ స్టంప్ మీదికి వేసిన బంతి నేరుగా అతని గజ్జలను తాకింది. దీనితో కొద్దిసేపు కోహ్లీ నొప్పితో విలవిల్లాడాడు. నెట్స్‌లో మోకాళ్లపై కూర్చుండిపోయాడు. కొద్దిసేపటి తరువాత నెట్స్ నుంచి బయటికొచ్చాడు.