పాలన సరిగా నడవడం లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు పాలన సరైన దిశలో సాగడం లేదంటూ సంచలన ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఢిల్లీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు సీనియర్ జడ్జిలు సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు. మీడియా సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడారు.సుప్రీంకోర్టు వ్యవస్థ సరిగా నడవడం లేదన్నారు. సుప్రీంకోర్టును సరిగా నడిపించే విషయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను ఒప్పించడంలో విఫలమయ్యామని, గత్యంతరం లేకే మీడియా ముందుకు వచ్చామని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సరిగా నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా? లేదా? అన్నది దేశ ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కేంద్రంగా నడిచే మెడికల్ కాలేజీల్లో చోటు చేసుకున్న అవినీతి కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎమ్సీఐ)వాటిలో అడ్మిషన్లు రద్దుచేసింది. ఈ విషయంలో సుప్రీం కోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యలతో భారీ డీల్ కుదుర్చుకున్న వ్యవహారాన్ని విచారించిన సీబీఐ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ ఆయున అనుచరులను నేరస్తులుగా తేల్చింది. అయినా ఆ మెడికల్ కాలేజీలకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అడ్మిషన్లు చేసుకునేందుకు అనుమతించడం వివాదాస్పదంగా మారింది. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)  నియమించాలని, అయితే ఆ సిట్‌లో దీపక్ మిశ్రా ఉండరాదన్న అభ్యర్థనను జస్టిస్ చలమేశ్వర్ సారథ్యంలోని ధర్మాసనం అంగీకరించింది.మెడికల్ కుంభకోణంపై సిట్‌ను నియమించాలన్న జస్టిస్ చలమేశ్వర్ ఆదేశాలను సీజేఐ మిశ్రా రద్దుచేయడమే కాకుండా, ఇష్రత్ అవినీతి కేసును విచారిస్తున్న ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తొలగించడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య వైషమ్యపూరిత వాతావరణం తలెత్తింది. ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో ఇప్పటి దాకా కొనసాగుతున్న కొలీజియం విధానం సమకాలీన పరిస్థితులకు తగినది కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం 2014లో ఎన్‌జేఏసీని ఏర్పాటు చేసేందుకు 99వ రాజ్యాంగ సవరణ చేసింది. అయితే ఈ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2016లో రద్దు చేయడంతో అత్యున్నత న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య గంభీరమైన వివాదం నెలకొంది. ఆ తర్వాత న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేపట్టినప్పటికీ అందుకు న్యాయ మంత్రిత్వ శాఖ అనుమతులివ్వకుండా కాలయాపన చేస్తుండడంతో ఆ వివాదం మరింతగా ముదిరింది. గత మే నెలలో కోల్‌కతా హైకోర్టులోని సిట్టింగ్ జడ్జి అవినీతిపై ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడు నెలల జైలుశిక్ష విధించిన ఉదంతంతో ఉన్నత న్యాయమూర్తులు, కింది స్థాయి న్యాయమూర్తుల నియామక పద్ధతులు సమకాలీన అవసరాలకు తగినట్లు మౌలిక మార్పులు చేపట్టవలసిన అవసరం జరూరుగా ముందుకొచ్చింది. ఉన్నత స్థాయి జడ్జీల నియామకాల్లో హేతబద్ధమైన, విలువలతో కూడిన పద్ధతులను అనుసరించకపోతే అవినీతిపరులు న్యాయమూర్తులుగా అవతారమెత్తే ప్రమాదం ఉందని జస్టిస్ చలమేశ్వర్ సారథ్యంలోని ధిక్కార జడ్జీల బృందం మీడియా ముందు బయటపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ వివాదాన్ని సాకుగా చూపి తిరిగి వివాదాస్పదమైన ఎన్‌జేఏసీ వ్యవస్థను కేంద్రం మరోసారి ముందుకు తెస్తే అది రాజ్యాంగ సంక్షో భంగా మారే అవకాశం లేకపోలేదు. అంతకంటే ముఖ్యంగా స్వయం ప్రతి పత్తితో సాగాల్సిన న్యాయవ్యవస్థ అవినీతిమయమైన ప్రభుత్వాల పంజ రంలో చిలుకగా మారే ప్రమాదం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*