సర్జికల్ దాడుల వీడియోను దాచిన కేంద్రం

surgical-strikes-operation-video-is-under-wraps

భారత ఆర్మీ పాకిస్థాన్ సరిహద్దు నియంత్రణ రేఖ దాటి ఉగ్రమూకల శిబిరాలు ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టకూడదని నిర్ణయించింది. ఉరీ ఘటన అనంతరం…పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోని పలు ప్రధాన పట్టణాలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలపై పది రోజుల నుంచి సరిహద్దు ప్రాంతంలో పటిష్ట భదత్ర పెంచారు. ఉరీ ఘటన జరిగిన సెప్టెంబర్ 18 నుంచి శత్రుసైన్యంపై పగ తీర్చుకోవాలని రగిలిపోతున్న ఇండియన్ సేన..అవకాశం కోసం ఎదురు చూసింది. శత్రు స్థావరాలపై పదిరోజులుగా కన్నేసింది. దీని కోసం ఉపగ్రహాల సాయం తీసుకుంది. భారత త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. పక్కా ప్రణాళికతో ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించాకే సర్జికల్ ఎటాక్స్ జరిగాయి. అయితే ఉరీ ఘటన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తట్టుకునేందుకు సర్జికల్ ఎటాక్స్ డ్రామాకు తెర తీసిందని పాక్ అంటుంది. కానీ, తీవ్రవాదులు ఎప్పుడు దాడులకు దిగినా ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉంది. దాడులతో ‘మాకు సంబంధం లేదు’ అనే పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ అనుభవం దృష్ట్యా ఇండియన్ ప్రభుత్వం, ఆర్మీ పకడ్బందీ ప్రణాళికతో వ్యవహారించింది. 2011లో పాకిస్థాన్ లో తలదాచుకున్న అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించినప్పుడు అమెరికా సేనలు వీడియో చిత్రీకరించినట్లుగా…సెప్టెంబర్ 29 అర్థరాత్రి దాటాక పాక్ ఉగ్రమూకలపై ఇండియన్ సేనలు సర్జికల్ అటాక్స్ చేసినప్పుడు కూడా వీడియో చిత్రీకరించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ని మూడు కిలో మీటర్ల పరిధిలో దాదాపు 7 నుంచి 8 వరకు ఏర్పాటు చేసిన ఉగ్రవాదుల స్థావరాలను అందులో ఉంటున్న 70 మందిని ఏరివేసింది. అయితే ఈ స్థావరాలపై ఆర్మీ దాడి చేస్తునప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడే బయట పెడితే పాకిస్థాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ వంటి ప్రముఖులు వీడియోను తిలకించారు. పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ ఆ వీడియోను బయటపెట్టి మరిన్ని ఇబ్బందులు తెచ్చుకోవద్దని భావించే దాన్ని భద్రంగా దాచిపెట్టాలని నిర్ణయించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*