నయీం కేసులో 3 గంటల పాటు టీఆర్ఎస్ నేతను ప్రశ్నించిన సిట్

trs-leader-investigated-gangster-nayeem-case-nalgonda

తెలంగాణ పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పలువురు అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు పోలీసు ఉన్నాతాధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. తొలిసారిగా ఓ రాజకీయ నేతను సిట్ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం కీలక పరిణామంగా మారింది. నల్గొండ పట్టణంలో చింతలను సుమారు మూడు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి చింతల ఆర్ధిక లావాదేవీలు జరిపాడనేది అభియోగం. విచారణలో భాగంగా చింతల నుంచి సిట్ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. చింతలను మరో మూడు సార్లు సిట్ ప్రశ్నంచనుంది. నయీంతో కలిసి చింతల అనేక భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సెటిల్‌మెంట్ కోటి రూపాయలకు పైమాటేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో నయీంతో కలిసి ఏయే సెటిల్ మెంట్లు చేశారని సిట్ అధికారులు దృష్టి సారించారు. నయీం కేసులో ఇప్పటి వరకు పోలీసుల అరెస్ట్ చేసిన నయీం అనుచరులపై పీడీ యాక్టు నమోదు చేయకుండా కలెక్టర్ ద్వారా చింతల అడ్డుపడ్డారని అభియోగం. దీంతో చింతల వెంకటేశ్వరరెడ్డి ద్వారా వచ్చిన సమాచారం ద్వారా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు విచారించనున్నారు. గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పటి వరకు 155 కేసులు నమోదైనట్లు సిట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో బిజీగా ఉండటంతో దసరా తర్వాత ఈ కేసు ఊపందుకోనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 95 మందిని అరెస్ట్ చేయగా, 8 మంది లొంగిపోయారు. 195 మందికి పిటీ వారెంట్లు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సిట్ 72 మందిని అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారు. నయీంతో ఆర్ధిక లావాదేవీలు జరిపిన పోలీసు ఉన్నతాధికారుల్లో ఎనిమిది మంది పోలీసులకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లో సిట్‌కు చట్ట బద్దత కల్పిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయనుంది. ప్రస్తుతం సిట్ డీజీపీ ఆధ్వర్యంలో వేసిన ఓ ఉన్నత స్థాయి ప్రత్యేక బృందం. నయీం కేసులో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఆర్ధిక లావాదేవీల ద్వారా లబ్ధిపొందారనే అభియోగం ఉన్న నేపథ్యంలో సిట్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాలంటూ డీజీపీ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇదే గనుక జరిగితే నయీంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు అందజేసి సిట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రశ్నించే అవకాశం సిట్‌కు రానుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సిట్ తన పనిని మొదలు పెట్టనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*