మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్‌ నిరాకరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ దేశాధ్యక్షురాలితో ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనీస మర్యాదగా ఇచ్చే షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నిన్న అమెరికా పర్యటనకు వెళ్లారు. అధ్యక్ష నివాసం శ్వేతసౌధంలో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్‌, మెర్కెల్‌ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు. ఫొటో కోసం విలేకరులు షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని అడిగినా స్పందించలేదు. దీంతో మెర్కెల్‌ స్వయంగా అడిగినా కూడా ఆయన ఏమాత్రం స్పందించకుండా అవమానపరిచారు. ట్రంప్‌ ప్రవర్తనకు ఆమె ఇబ్బందిపడుతూ చిన్నగా నవ్వారు. మెర్కెల్‌ వైట్‌హౌస్‌కు ఆహ్వానించే సమయంలో ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. కానీ అందరి ముందు అడిగినా ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ట్రంప్‌ తీరుతో కంగుతిన్న నెటిజన్లు ఆయనపై తెగ కామెంట్లు చేస్తున్నారు. జోకులేసుకుంటున్నారు. విలేకరులు కరచాలనం కోసం అడిగారు కదా.. ఫేక్‌ న్యూస్‌ అని ఆయన షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలనుకోలేదు అని.. ఆయన బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉందో గమనించారా? అని ఆగ్రహంతో కొందరు.. మెర్కెల్‌ తన చిన్న చేతుల్ని నలిపేస్తారేమోనని ట్రంప్‌ భయపడ్డారనుకుంటా అని కొందరు వెక్కిరించారు. అధ్యక్ష స్థానంలో ఉండి పిల్ల చేష్టలు చేస్తున్నాడంటూ ట్వీట్లు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*